కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో మూడేళ్లలో పీకల్లోతు కష్టాల్లో మునిగిన జనం కష్టాలు పడుతుంటే, పాలకులు మాత్రం ఉత్సవాల పేరుతో ఊరేగుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. 'జనం కోసం సిపిఎం. ఇంటింటికీ సిపిఎం' కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. కృష్ణలంక 21వ డివిజన్, 21వ డివిజన్ , సుందరయ్య గ్రంథాలయం వద్ద, సత్యంగారిహోటల్ రోడ్డు, ఆయనతోపాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తదితరులు పాదయాత్ర చేసి ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడేళ్ల పాలన గొప్పతనం అంటూ మోడీ, జగన్ ప్రభుత్వాలు ప్రచారార్భాటం చేయడం శోచనీయమన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారాలు పెంచి ప్రజల నడ్డి విరిచిన పాలకులకు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కార్పొరేట్లు, పాలక పార్టీల బడా నేతలు తప్ప, ప్రజలకు ఒరిగిందేమీలేదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారని, సాధారణ ప్రజల జీవన పరిస్థితి మెరుగుకాలేదని, ఆదాయాలు పడిపోతున్నాయని వివరించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్రం ఆదేశాలకు తలగ్గి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసిందన్నారు. ఓవైపు సంక్షేమ పథకాల్లో కోత పెడుతూ, మరోవైపు అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, అవినీతి పెచ్చరిల్లిందని విమర్శించారు. ప్రశ్నించే వారి గొంతు నులుముతున్నారని, ప్రజా ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారని అన్నారు.
హామీలను నెరవేర్చకపోగా మళ్లీ 2024లో గెలిపించండని ఇప్పటి నుండే ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షాలకు అధికార యావ తప్ప, ప్రజల గోడు పట్టడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అజెండాతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నెలరోజులపాటు చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమాలు చేపడతామని, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తామని, హామీలు నెరవేర్చే వరకు పోరాడుతామని అన్నారు