మసాజ్ పేరుతో యువకుడిని ఆకర్షించి అక్కడ తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయటంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో మసాజ్ మాఫియా రెచ్చిపోతోంది. చేసేదే ్సాంఘిక కార్యకలాపం దానితో పాటు మళ్లీ బ్లాక మెయిలింగ్. ఇది తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి(30) అనే వ్యక్తి ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో వివాహం అయ్యింది. శ్రీకాంత్ రెడ్డి ఉద్యోగంలో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చి వెళుతున్నాడు. ఈక్రమంలో అతనికి చైతన్య అనే మహిళ, ఆమె భర్త సత్యకుమార్, వినుకొండ సునీల్ అనే ముగ్గురు పరిచయం అయ్యారు. వీరు శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల ఒక మాసాజ్ సెంటర్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న మహిళతో చనువుగా ఉండేలా చేసి. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో సెల్ ఫోన్ లో శ్రీకాంత్ రెడ్డి ఫోటోలు, వీడియోలు తీశారు. శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయాక అతని సెల్ ఫోన్ కు ఈ వీడియోలు, ఫోటోలు పంపించి బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించారు.
ఈ ఫోటోలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయటం ప్రారంభించారు. ఈ పరిస్ధితుల్లో తీవ్ర ఒత్తిడికి లోనైన శ్రీకాంత్ సోమవారం విజయవాడలోని ఒక హోటల్ లో తన ఆవేదనను అంతా చెపుతూ సెల్ఫీ వీడియో తీశాడు. మసాజ్ పేరుతో తనను వారెంతగా వేధిస్తున్నారో చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం హోటల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందుతులు ముగ్గురునీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.