జగనన్న హరిత నగరాలులో భాగంగా మొదటి విడతలో ఉన్న 45 యూఎల్‌బీల్లోని రోడ్లకు ఇరువైపులా, మధ్యనున్న మీడియన్స్‌లలో మొక్కలు నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి, వాతావరణం, నీటి వనరుల లభ్యత ఆధారంగా బతికే వివిధ జాతులకు చెందిన 54 రకాల మొక్కలను ఎంపిక చేసి పెంచనున్నారు. రహదారి వెడల్పును బట్టి ఐదు రకాలుగా విభజించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చదనం, సుందరీకరణ పనులకు రూ.78.84 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలకరి ప్రారంభం నుంచి ఆగస్టు 12లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆయా మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటిన అనంతరం పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు అప్పగిస్తారు. అనంతరం ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌కు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందం 3 నెలలకు ఒకసారి పరిశీలించి.. మొక్కల సంరక్షణకు అవసరమైన సూచనలిస్తుంటుంది.