కృష్ణా: వత్సవాయి మండలం కంభంపాడులో జరిగిన వ్యక్తి మృతి కేసు విచారణ పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. మృతుడు పాటిబండ్ల శ్రీనివాసరావు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు మేనత్త కొడుకు అవుతారు. గత నెల 31న శ్రీనివాసరావు తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామ వీఆర్వో శివాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది నట్లు కేసు నమోదు చేశారు. మృతదేహానికి జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అదే రోజు మృతుని కుమారుడు అనుదీప్ ను పోలీసులు విచారణ చేయగా తండ్రిపై దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ నెల 3న పద్మ కంభంపాడులోని బంధువుల ఇంటికి వచ్చారు.
గ్రామస్థులతో ఆమె మాట్లాడిన సమయంలో కుమారుడి దాడి వల్లే తండ్రి మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. ఆ విషయాన్ని ఆమె వెంటనే ఎస్సై మహాలక్ష్మణుడు దృష్టికి తీసుకుపోయారు. విచారణ నిష్పక్ష పాతంగా చేయాలని ఎస్సైని ఆదేశించారు. ఆమె గ్రామం నుంచి వెళ్లిన వెంటనే పోలీసులు కేసులో సెక్షన్లు మార్చారు. తండ్రిపై కుమారుడు దాడి చేయడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. అదే రోజు అనుదీప్ ను అరెస్ట్ చేసి మరుసటి రోజు రిమాండ్ కి పంపారు. తర్వాత ఈ విషయాన్ని ఆమె సీపీ కాంతిరాణా టాటా దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సోమవారం కేసు విచారణ బాధ్యతలను ఎస్సై నుంచి జగ్గయ్యపేట సీఐకి బదలాయించినట్లు తెలిసింది. ఈ కేసు విష యమై మంగళవారం ఎస్సై, సీఐ, ఏసీపీలు విజయవాడ వెళ్లి చైర్పర్సన్ ను కలిసినట్లు సమాచారం. కేసును నిష్పక్ష పాతంగా విచారించాలని ఆమె వారికి సూచించగా, తానే స్వయంగా విచారణ చేస్తానని ఏసీపీ చెప్పినట్లు తెలిసింది. ఒక అవకాశం ఇస్తున్నానని, లేదంటే సీఐడీకి అప్పగిస్తానని హెచ్చరించినట్లు సమాచారం.