ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల పట్ల బస్సు స్టేషన్ సిబ్బంది తీరు తెన్నులను దగ్గర నుండి పరిశీలించారు. మొదటగా బస్ పాస్ కౌంటర్ చేరుకొని విద్యార్ధులకు పాసులు జారీ చేసే విధానం పరిశీలించారు. వారి సమయాన్ని వృధా చేయకుండా వీలైనంత తక్కువ సమయంలో వారికి పాసులు అందజేయాలని తెలిపారు. తదుపరి డిపార్చర్ బ్లాక్ లో గల సమాచార కేంద్రాన్ని సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిని, ప్రయాణికుల పట్ల వారు స్పందిస్తున్న తీరుని గమనించారు. బస్టాండ్ లోని ఆన్ డ్యూటీ కంట్రోలర్ల పనితీరును పర్యవేక్షించారు. అనంతరం మరుగుదొడ్ల పరిశుభ్రత, శానిటైజేషన్ కార్యక్రమాల అమలు వంటి వాటిని నిశితంగా గమనించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసారు. ప్రయాణికుల సొరంగ మార్గం ద్వారా నడిచి వస్తూ లైట్లు, సి. సి. కెమెరాలు ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలని సూచించారు. *
బస్టాండ్ లోని ప్రయాణికుల రద్దీ, ప్లాట్ ఫారం లోని బస్సుల నిలుపుదల, నాన్ స్టాప్ కౌంటర్లు, ప్రయాణికులు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, వసతులు తదితర వాటిని పరిశీలించారు. వేసవి కాలంలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన కూలర్లు, మిగతా సౌకర్యాలను గమనించి ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్టాండ్ లో ఉన్న గెస్ట్ హౌస్ లను పరిశీలించి అక్కడ వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు గదులను పరిశుభ్రంగా ఉంచాలని, దానిపై వచ్చే రాబడిని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో ఎం. డితో పాటు జోన్- 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. వై. దానం, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, బషీర్ (పి. ఎన్. బి. ఎస్. ), చీఫ్ సివిల్ ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.