ప్రధాన రహదారులపై పక్కనే కారు పార్కింగ్ చేసే ఇంకో కారణంతో ఆగుతున్నారా అయితే జాగ్రత్త...అది మీ ప్రాణాలకే ముప్పు తేవచ్చు. ఇటీవల అలాంటి ఘటనయే చోటు చేసుకొంది. పక్షిని కాపాడాలనే తాపత్రయంలో తమ ప్రాణాలను కోల్పోయారు. గద్దను కాపాడటం కోసం చేసిన ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను పోగొట్టుకున్న విషాదకర ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. బాంద్రా-వర్లి (సీ లింక్) సముద్ర మార్గంపై మే 30న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమర్ మనీష్ జరీవాలా అనే 43 ఏళ్ల వ్యక్తి మలద్‌కు ట్యాక్సీలో వెళుతుండగా.. సీలింక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఓ గద్ద ఉన్నట్టుండి వారి కారు కింద చిక్కుకుపోయింది. దీంతో వాహనాన్ని ఆపాలని డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్‌ను జరీవాలా కోరాడు. ఇద్దరూ కారు నుంచి కింద దిగి రోడ్డుపై నిలబడ్డారు. కారు కింద ఉన్న గద్దను ఎలా కాపాడదామని ఆలోచిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఇద్దరినీ బలంగా ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది. కారు వేగానికి ఇద్దరూ చెరో వైపు ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో మనీష్ జరీవాలా అక్కడికక్కడే మృతిచెందాడు.
తీవ్రంగా గాయపడిన డ్రైవర్ కామత్‌ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గద్దను కాపాడాలన్న ఆలోచనలోనే ఉండిపోయిన ఇద్దరూ తమకు పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. వెనుక నుంచి వచ్చే కార్లను చూసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ విషయంలో ట్యాక్సీ డ్రైవర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. ముందున్న ఇద్దరినీ అసలు చూసుకోకుండా వేగంగా వాహనం నడుపుతుండటం వీడియోలో కనిపిస్తోంది. దీంతో ట్యాక్స్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.