పవన్ కల్యాణ్ జనసేన పెట్టింది జనం కోసమా.. చంద్రబాబు కోసమా అంటూ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్ వెంటనే ప్రెస్‌మీటో.. యాత్రో చేస్తారని అన్నారు. అయితే ఇప్పుడు పవన్ బస్సు యాత్ర ఎందుకు చేస్తూన్నాడో ఆయనకైనా తెలుసా అని మంత్రి రోజా ప్రశ్నించారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో నియోజకవర్గ నాయకులతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. నాతో మహా ద్వారం ద్వారా గన్ మెన్ వెళ్లారని పచ్చ ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహా ద్వారం నుండి నేను మాత్రమే వెళ్లాను అని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పురాతన ఆలయాలను కూల్చివేసిన సమయంలో ఈ ఛానల్స్ ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా మారాలని లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత పై టిడిపి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మహనాడులో తోడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నాయకులు, లోకేష్ జూమ్ మీటింగ్‌కి కొడాలి నాని, వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం ఉందని, అందుకే మాట్లాడితే పార్టిని మూసివేస్తాను అంటున్నాడని రోజా ఎద్దేవా చేసారు.