నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23న హాజరు కావాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.ముఖ్యంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీ నిరసనల్లో పలు జాతీయ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కేసు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య అని, ఈ కేసు విచారణకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కోశాధికారి పవన్ బన్సాల్‌లను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇద్దరు కాంగ్రెస్ నేతల వాంగ్మూలాలను అధికారులు రికార్డు చేసుకున్నారు.