వైసీపీ ప్రభుత్వం మహిళల సంక్షేమం గాలికొదిలేసి మసిపూసి మారేడుకాయ చేస్తుందని, అమ్మఒడి, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు రూపాయి ఇచ్చి పది రూపాయిలు లాగేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. పథకాల పేరుతో మహిళలకు రూపాయి ఇచ్చి, నిత్యావసర సరుకులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెంచేసి పది రూపాయిలు గుంజుతున్నారని దుయ్యబట్టారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. గుంటూరులో వెంకాయమ్మ అనే నిరుపేద మహిళ కడుపు మంటతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే, దళిత పేదరాలు అని కూడా చూడకుండా వేధింపులకు దిగడం వైసీపీ నాయకుల అరాచకాలకు నిదర్శనమన్నారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మహిళల ఓట్లు వేయించుకున్న వైసీపీ నాయకులు, మద్యం అమ్మకాల ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయడం విడ్డూరమన్నారు. గతంలో టీడీపీ హయాంలో బీచ్ ఫెస్టివల్ చేస్తామంటే అడ్డుకున్న వైసీపీ నాయకులు, ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, పర్యాటక శాఖ మంత్రి రోజా కలిసి క్రూయెజ్ సంస్కృతి తేవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.