జూన్16 నుండి 18 వ తేదీ వరకు రాష్ట్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా “సైబర్ నేరాలు మరియు సైబర్ భద్రత” పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పోలీస్ శాఖ తెలియజేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా MHA ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాలలో అవగాహన కార్యక్రమాలు. రాష్ట్రంలో విశాఖపట్నం వేదికగా “VUDA చిల్డ్రన్స్ అరెనా” నందు 16.06.2022 (గురువారం) జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీస్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొంటారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంగీత నాటక అకాడమీ వారి సాంస్కృతిక ప్రదర్శన, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి ప్రదర్శన, సైబర్ నేరాలపై నిపుణుల చర్చలు మరియు ఇతర అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రదేశాలలో (శ్రీకాకుళం, రాజమహేంద్రవరం,కాకినాడ,విజయవాడ,గుంటూరు,నెల్లూరు,కడప,కర్నూలు,తిరుపతి ,అనంతపురం) నిర్వహించే సైబర్ అవగాహన కార్యక్రమాలలో విద్యార్థులు,ప్రజలు మరియు మహిళలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్విజ్, ట్యాగ్‌లైన్ పోటీ మరియు నినాదాల పోటీలు నిర్వహించడంతో పాటు సైబర్ నేరాలు, సైబర్ భద్రత పై చర్చలతో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.