త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉండే 19 పార్టీలు మరియు బీజేపీయేతర పార్టీల సీఎంలకు మమతా బెనర్జీ ఆహ్వానం పలికారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపారు. అయితే ఈ కీలక భేటీకి దూరంగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ పార్టీ టీఆర్‌ఎస్ తరపున ప్రతినిధి బృందాన్ని కూడా పంపకూడదని నిర్ణయించారని సమాచారం.