ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెలలో . I2యూ2 గ్రూపు దేశాల భేటీ

international |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 04:33 PM

ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్ఏ (అమెరికా) కలిసి కొత్త గ్రూప్‌గా ఏర్పడ్డాయి. I2యూ2 అని పిలిచే ఈ గ్రూప్ దేశాల అధినేతలు వచ్చే నెలలో తొలిసారి వర్చువల్ విధానంలో భేటీ కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ మిత్ర దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసం బైడెన్ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా I2యూ2 గ్రూప్2ను ఏర్పాటు చేసినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.


‘భారత్, ఇజ్రాయెల్, యూఏఈతో ఆర్థిక సంబంధాలు, వాణిజ్యా్న్ని బలోపేతం చేసుకుంటాం. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. అది మరింత బలోపేతం కావాలని’ అని అమెరికా ఆకాక్షించింది.


జూలై 13-16 తేదీల మధ్య అమెరికా అధ్యక్షుడు మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆ సమయంలోనే I2U2 సమావేశం జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్టాలీ బెన్నెట్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ I2U2 వర్చుల్ భేటీలో పాల్గొననున్నారు. ఆహార భద్రత, ఇతర రంగాల్లో సహకారం తదితర విషయాలను ఈ సందర్భంగా చర్చించనున్నారు.


భారత్, యూఏఈ, ఇజ్రాయెల్ దేశాలు టెక్నాలజీ హబ్‌లుగా రూపొందాయని ఈ సందర్భంగా అమెరికా ప్రశంసించింది. ‘‘భారత్‌ అతిపెద్ద మార్కెట్.. అంతే కాకుండా అతిపెద్ద ఉత్పత్తిదారు కూడా. టెక్నాలజీ, వాణిజ్యం, వాతావరణం, కోవిడ్-19, భద్రత తదితర అంశాల్లో మా నాలుగు దేశాలు కలిసి పని చేస్తాయి’’ అని అమెరికా వెల్లడించింది. బయోటెక్నాలజీ రంగం కూడా కీలకమైందని పేర్కొంది.


గత ఏడాది అక్టోబర్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. ఆ సమయంలో ఈ నాలుగు దేశాల కూటమిని ‘ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్‌’ అని పిలిచారు. ఈ కొత్త కూటమిని పశ్చిమ ఆసియా క్వాడ్ అని భారత్‌లో యూఏఈ రాయబారి అహ్మద్ అల్బన్నా పేర్కొనడం గమనార్హం. భారత్‌కు ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ దేశాలతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయి, భద్రతా సహకారంపైనా అవగాహన ఉంది. కానీ ఇప్పుడు ఈ నాలుగు దేశాలు కలిసి భద్రత విషయంలో పరస్పరం సహకరించుకుంటాయా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.


గత కొన్నేళ్లుగా అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన బైడెన్ సర్కారు.. ప్రపంచ దేశాలతో కూటములు కడుతోంది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం కోసం భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన అమెరికా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకేలతో ఆకస్ అనే త్రైపాక్షిక రక్షణ ఒప్పందం చేసుకుంది. క్వాడ్ కూటమిని ఆసియా నాటోగా మార్చాలని అమెరికా భావించినప్పటికీ.. చైనాతో సంబంధాలను పూర్తిగా చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం.. చిరకాల మిత్రుడు రష్యాకు దూరం కావాల్సి వస్తుందనే కారణంతో భారత్ అందుకు అంగీకరించలేదు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa