కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. నగరంలోని కార్తే పర్వాన్ గురుద్వారా లో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.ఈ ఘటనలో కనీసం ఇద్దరు సాధారణ పౌరులు మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరికొంత మంది భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది.గురుద్వారా నుంచి భారీ ఎత్తున పొగ బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని దగ్గరి నుంచి గమనిస్తున్నట్లు తెలిపింది. అక్కడి తాజా పరిస్థితిపై సమాచారం కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది.
''ఉదయం 6 గంటల సమయంలో కార్తే పర్వాన్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించింది. అరగంట తర్వాత మరో పేలుడు సంభవించింది. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని పూర్తిగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి'' అని ప్రత్యక్షసాక్షిని ఉటంకిస్తూ ఓ అంతర్జాతీయ మీడియా ఛానల్ కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటనలో పలువురు మరణించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్నంతా గాలిస్తున్నట్లు పేర్నొన్నారు.కొంతమంది దీన్ని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. పేలుళ్లు జరిగిన సమయంలో గురుద్వారాలో భక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఐఎస్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అఫ్గాన్ పాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఉగ్రకార్యకలాపాలు పెరుగుతూ వస్తున్నాయి.