రాష్ట్రంలో ఒకటో తారీకు వచ్చిన వెంటనే వృద్యాప్య పెన్షన్ , వితంతు పెన్షన్ గ్రామా, వార్డు వాలంటీర్ ద్వారా నేరుగా ఇంటికే తీసుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. జగన్ పాదయాత్ర చేసే సమయంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పెన్షన్ ఏర్పాటు చేస్తాం అని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరి మహిళలకి సంబంధించిన పెన్షన్ పధకంలో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ వార్త పత్రిక ప్రచురించిన వార్తని ఆధారం చేసుకొని టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... మహిళలు అందరికీ 45 ఏళ్ళకే పింఛన్లు ఇస్తాను అంటూ బూటకపు హామీలతో మోసం చేసిందే కాక, ఇప్పుడు ఉన్న పింఛన్లు కూడా తొలగిస్తున్నావా జగన్ రెడ్డి? గ్రామాల్లో 30, పట్టణాల్లో 35 సంవత్సరాలకు పైబడి ఒంటరి మహిళలకు వచ్చే పింఛన్లను కూడా రెండు లక్షల మందికి కోత పెట్టడం నమ్మక ద్రోహం అని తెలియజేసారు.