తమ హక్కుల కోసం చేసే ఆందోళనలు ఒక్కోసారి హింసాత్మకంగా మారుతాయి. అనేక సందర్భాలలో ప్రజా జీవితాన్ని అతలాకుతలం కూడా చేస్తుంటాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సాగిన ఆందోళన ఓ విషాదానికి కారణమైంది. విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ నియామకాలకు సంబంధింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రైలు నిలిచిపోవడంతో సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కోర్బా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన జోగేష్ బెహరా (70) అనే వృద్ధుడు కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖపట్నంకు బయల్దేరారు. కుటుంబ సభ్యులతో కలిసి కోర్బా- విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో పయనమయ్యారు. అయితే, అగ్నిపథ్ అల్లర్లతో విశాఖపట్నం వెళ్లాల్సిన రైలును కొత్తవలసలోనే నిలిపివేశారు. ఈ సమయంలోనే బెహరాకు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. సమయానికి అంబులెన్స్ కూడా లేక చాలాసేపు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక చేసేది లేక, కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.