ఇంతకాలం అమాయకుల ప్రాణాలతో ఉగ్రవాదులు చెలగాటమాడితే భద్రాత దళాలు చేపట్టిన ఏరివేతతో వారు తోక ముడుస్తున్నారు. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో సైన్యం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో రెండు రోజుల్లో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. రెండు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం తెల్లవారుజామున మరో మగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఆదివారం కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కుప్వారా జిల్లాలో ఇద్దరు, పుల్వామా జిల్లాలో ఒకరు హతమైనట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. పుల్వామాలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
సోమవారం షౌకత్ గోత్ సహా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టామని, ఘటనా స్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. అంతకుముందు కుప్వారాలోని చండీగామ్ లోలాబ్ అటవీ ప్రాంతంలో అరెస్టయిన ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆదివారం సాయంత్రం ఉమ్మడి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది.
ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అలాగే, కుల్గామ్‌లోని డీహెచ్ పొరా వద్ద ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. గత కొద్ది నెలలుగా కశ్మీర్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లలో కీలక కమాండోలు సహా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మృతిచెందారు. నిఘా వర్గాలు సమాచారం మేరకు సైన్యం ఆపరేషన్‌లు విజయవంతమవుతున్నాయి. రెండేళ్ల తర్వాత అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. జూన్ 30న యాత్ర ప్రారంభ కానుండగా.. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. యాత్రపై ముష్కర మూకలు దాడికి చేస్తున్న కుట్రలను సైన్యం భగ్నం చేస్తోంది.