అగ్నిపథ్ ను వ్యతిరేకించవద్దు అంటారు...నాలుగేళ్లు పూర్తయ్యాక, అగ్నివీరులను ఎంపిక చేసే 25శాతం వ్యక్తుల్లో నేను లేకుంటే ఆ తరువాత జీవితం ఎలా అని ఆందోళనలను అదుపుచేయడానికి వచ్చిన ఓ ఉన్నతాధికారికి పలువురు నిరసనకారులు ప్రశ్నలు సంథించారు. మీ సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తా...ఉద్రిక్తలు రేపవద్దు అంటూ ఆ ఉన్నతాధికారి అగ్నిపథ్ నిరసనకారులకు చెప్పి వెనుదిరగాల్సి వచ్చింది.
ఇదిలావుంటే సైనిక నియామాకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి రైళ్లకు నిప్పంటించడం, ప్రజా ఆస్తుల ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే, కొన్ని చోట్ల మాత్రం సైనిక ఉద్యోగార్ధులు శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హరియాణాలోని పానిపట్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిరసనలో ఆందోళనకారులు, పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ అధికారికి మధ్య పరస్పర చర్య భావోద్వేగంగా మారింది.
ఈ ఆందోళనల్లో మీ కుమారుడే ఉంటే ఏం చేసేవారు? అని డ్యూటీ మేజిస్ట్రేట్ ఎల్డీఎం కమల్ గిరిధర్‌ను అక్కడున్న ఓ యువకుడు ప్రశ్నించాడు. దీంతో ఆయన ఆ యువకుడ్ని వెంటనే తన గుండెలకు హత్తుకుని ఓదార్పునిచ్చేందుకు ప్రయత్నించారు. ‘నువ్వు నా కొడుకు లాంటివాడివి’ అని సమాధానమిచ్చారు. మీ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇస్తూ, కెరీర్‌ను నాశనం చేసుకోవద్దని నిరసనల్లో పాల్గొన్న యువతను అభ్యర్థించడం వీడియోలో కనిపిస్తోంది.
‘‘బాబూ.. నేను మీ తండ్రి వయస్సులో ఉన్నాను.. మీ కెరీర్ నాశనం కావచ్చు.. నేను మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను’’ అని అధికారి నిరసనకారులతో చెప్పారు. అంతేకాదు, ఆందోళనకారులను చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, అలాచేస్తే వారిపై చర్య తీసుకోవాలని యంత్రాంగం ఆదేశించిందని వివరించారు.
మరో యువకుడు అగ్నిపథ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ ‘‘నేను ఆర్మీ పరీక్ష కోసం తొమ్మిదేళ్లుగా సిద్ధమవుతున్నాను.. ఒకవేళ నేను అగ్నిపథ్ కింద ఎంపికై నాలుగేళ్లు మాత్రం సర్వీసులో ఉంటాను.. తర్వాత శాశ్వతంగా కొనసాగించే 25 శాతం మందిలో నేను ఉంటానో? లేదో? తెలియదు.. నేను డిగ్రీ కూడా చేయలేదు.. ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నాను.. నేను 26 సంవత్సరాల వయస్సులో ఆర్మీ నుంచి బయటకొస్తే డిగ్రీ పూర్తి చేయడానికి నాకు మరో 3 ఏళ్లు పడుతుంది.. 30 సంవత్సరాల వయస్సులో నేను మరో ఉద్యోగం ఎలా పొందగలను’’ అని ప్రశ్నించాడు.
ఇదిలావుంటే అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరిన యువతకు సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్ సహా రక్షణ శాఖ పరిధిలోని సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే, మూడేళ్ల వయో పరిమితి పెంచుతామని పేర్కొంది. నేవీలో పనిచేసి అగ్నివీరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa