ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత ఎన్టీఆర్ కు ఉన్న చరిష్మా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ చరిష్మాను వాడుకొంటే తాము ఏపీలో ఎదగాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురందేశ్వరీని రంగంలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఏపీలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన తర్వాత బీజేపీ నాలుగోస్థానంలో ఉంది. వాస్తవానికి కమ్యూనిస్టులకే బీజేపీకన్నా క్షేత్రస్థాయిలో బలం ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల ఆ పార్టీ నాలుగో అతి పెద్ద పార్టీగా చెలామణి అవుతోంది. ఇప్పటినుంచే బలోపేతం చేస్తే ఒక ఐదు సంవత్సరాల కాలంలో పార్టీకి దీర్ఘకాలికంగా లాభం చేకూరుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ఏపీకి బీజేపీ అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఒకశాతం ఓటుబ్యాంకు కూడా లేని భారతీయ జనతాపార్టీని అనూహ్యరీతిలో బలోపేతం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాలోచనలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణతో పాటు ఏపీలో కూడా బలోపేతం కావాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్న అమిత్ షా అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది.
పురంధేశ్వరిని అధ్యక్షురాలిని చేస్తే ఆమె సామాజికవర్గానికి చెందినవారితోపాటు తెలుగుదేశం పార్టీలోని కొందరు సీనియర్ నేతలను కూడా బీజేపీలోకి చేర్చుకొని బలోపేతానికి కృషిచేయాలని అధినాయకత్వం భావిస్తోంది. సోము వీర్రాజు స్థానంలోనే పురంధేశ్వరిని నియమిస్తారంటూ గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ అప్పుడు అధ్యక్ష పదవి వీర్రాజుకు దక్కింది. అయితే ఆయన అధ్యక్షుడైన తర్వాత పార్టీ ఇసుమంత కూడా బలపడలేదని పార్టీ పెద్దలు తెప్పించుకున్న నివేదికలద్వారా వెల్లడైంది. పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా సోము రూపొందించలేకపోతుండటంతో ఆయన్ను తప్పించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలకు పురంధేశ్వరి ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఆమె ఏపీ బీజేపీకి అధ్యక్షురాలైతే రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారతాయని మాత్రం స్పష్టమవుతోంది.
ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైతే కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె సమర్థత కూడా పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెంది, ఆమె బంధువైన చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో బలమైన సామాజికవర్గ నేతగా ఉన్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌తో మిత్రత్వం ఉంది కాబట్టి ఆ సామాజికవర్గం కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుందనే ప్రణాళికలో కేంద్ర పెద్దలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa