ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడ్డలను అమలు చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వింత కథనం చక్కర్లు కొడుతోంది. ఇది కూడా ఎన్నికల వ్యూహంలో భాగమేనా అన్న చర్చ సాగుతోంది. ఇంతకు ముందు పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని ప్రకటించిన జనసేనాని.. కొద్ది రోజులకే వెనక్కి తగ్గారు. తన పొత్తు ప్రజలతో మాత్రమేనంటూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందా..? లేదా జనసేన, బీజేపీ మాత్రమే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయా..? లేదంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా అనే చర్చ మొదలైంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ బహిరంగ సభ నిర్వహించినా.. ఆయన అభిమానులు, జనసైనికులు సీఎం.. సీఎం.. నినాదాలతో హోరెత్తిస్తుంటారు. పవన్ కళ్యాణ్ వారించినా వారు వెనక్కి తగ్గరు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికలను జనసేనాని టార్గెట్ చేశారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల పర్చూరు సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎల్లుండి ఎన్నికలు వచ్చినా.. పోటీకి తాము సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలోనే ప్రస్తావించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున, తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ!, రాజవారసత్వము నశించినయ!, ప్రజారాజ్యము విలసిల్లునయ!, తప్పదు నా మాట నమ్మండయ!!’’
అని బ్రహ్మంగారు చెప్పారని ట్విట్టర్లో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో తెలుగు సంవత్సరాల్లో సిద్ధార్థి ఎప్పుడొస్తుందోనని జనసైనికులు తెగ వెతికేస్తున్నారు. 1919, 1979, 2029, 2099ల్లో సిద్ధార్థి నామ సంవత్సరం వస్తుందని కొందరు వికీపీడియా లింక్‌ను షేర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఒకవేళ కుదరని పక్షంలో 2029లో అధికారం కచ్చితంగా తమదేనని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొంది 2039 కావడంతో ఒకింత నిరాశ చెందుతున్నారు.
కాకపోతే.. ఇదంతా నిజంగా కాలజ్ఞానంలో ఉందా..? లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇది ప్రచారం చేస్తున్నారా? అనే సందేహం సైతం తలెత్తుతోంది. ఇందులో ఉన్న తెలుగు రాష్ట్రము, పవనుడు, ప్రజారాజ్యము అనే మాటలు కల్పితంగానే కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్ర దోషము వీడేనయా.. అంటూ ‘కాలజ్ఞానా’న్ని వైరల్ చేశారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ.. కరోనా వస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
రాజకీయ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజిస్టులను ఆశ్రయించడం మొదలయ్యాక.. తాము ప్రచారం చేసే పార్టీకి అనుకూలంగా.. ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సాధారణమైంది. ఇందుకోసం ప్రతి మార్గాన్నీ వాడుకుంటున్నారు. సాధారణ ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం.. అంతర్లీనంగా జనంలోకి ఓ సందేశం పంపడం కోసం సోషల్ మీడియాను వాడుకోవడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయింది.