ఆందోళనల సమయంలో పోలీసులు, నిరసన కారుల మధ‌్య తోపులాట సహజం. కానీ కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఓ మహిళా నేత ఆగ్రహం కట్టలుదాటింది. దీంతో ఆమె ఓ మహిళా కానిస్టేబుల్ పై ఏకంగా ఉమ్మేసింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న తీరుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు కొనసాగిస్తున్న ఆందోళనల్లో మంగళవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిరసనల్లో పాలుపంచుకుంటున్న తమను నిలువరించే యత్నం చేస్తున్న పోలీసులపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఏకంగా ఉమ్మేసి కలకలం రేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
మంగళవారం ఐదో రోజు రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన రాహుల్‌ను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నిరసనకు దిగిన డిసౌజా సహా పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన సందర్భంగా వారిని వ్యాన్ దించే క్రమంలో డిసౌజాను మహిళా పోలీసులు కిందకు లాగారు. అయితే వారి పట్టు నుంచి చేతిని విడిపించుకున్న డిసౌజా మహిళా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ఆమె కోపం పట్టలేక... ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఉమ్మేశారు. ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్న కాంగ్రెస్ నేతలు వ్యాన్ డోర్ మూసి ఆమెను నిలువరించారు.