తన పాలసీదార్లకు ఐసీఐసీఐ బ్యాంకు వరాలు ప్రకటించింది. పెద్ద ఎత్తున్న బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీదారులకు ఇలాంటి గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ తన పాలసీదారులకు బోనస్‌ను ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో 10 లక్షల మంది పాలసీదారులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది కంటే 12 శాతం ఎక్కువ బోనస్‌ను అందిస్తున్నట్టు ఈ కంపెనీ తెలిపింది. దీని కోసం కంపెనీ మొత్తంగా రూ.968.8 కోట్లను ఖర్చు చేయనుంది. వరుసగా 16 సంవత్సరాల పాటు ఈ కంపెనీ తన పాలసీదారులకు ప్రతేడాది బోనస్‌ను చెల్లిస్తూ వస్తోంది. బోనస్‌ను ప్రకటించిన ఈ కంపెనీ, మార్చి 31, 2022 నాటికి రన్నింగ్‌లో ఉన్న అన్ని పాలసీలకు ఈ బోనస్ వర్తిస్తుందని తెలిపింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్, ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లు ప్రమోట్ చేస్తున్నాయి.
కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రకటించిన అతిపెద్ద బోనస్ ఇదేనని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎన్‌ఎస్ కన్నన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గతేడాది కంటే 12 శాతం ఎక్కువ బోనస్‌ను ఇవ్వనున్నట్టు తెలిపారు. కరోనా తర్వాత తమ వ్యాపారాలకు ఎదురైన అన్ని సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నట్టు కన్నన్ చెప్పారు. 2022 ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్‌లో త్రైమాసిక బేసిస్‌లో కంపెనీకి రూ.185 కోట్ల నికర లాభాలు వచ్చినట్టు తెలిపారు. బలమైన ఫండ్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలతో తమ కంపెనీ బలమైన స్థానంలో ఉందని చెప్పారు. ఈ కారణంతోనే కంపెనీ తన పాలసీదారులకు పాలసీ కొనేటప్పుడు నిర్ణయించిన దాని కంటే అత్యధిక బోనస్‌ను ఇవ్వగలుగుతుందని చెప్పారు. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరం లాభాలను తీసుకుంటే మాత్రం కంపెనీ లాభాలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కాస్త తగ్గాయి.