తన బ్యాంకు కస్టమర్లకు మరింత సౌలభ్యంగా పేమెంట్స్ వ్యవస్థలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మార్పులు చేపట్టింది. ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్ డీఎఫ్ సీ తన కోర్ బ్యాంకింగ్ మాడ్యుల్ నుంచి పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను వేరు చేస్తోంది. ఇలా వేరు చేయడం ద్వారా ఒకవేళ కోర్ బ్యాంకింగ్ అందుబాటులో లేకపోయినా యూజర్లకు పేమెంట్లలో ఎలాంటి ఇబ్బందులుండవు. పేమెంట్స్ డౌన్‌టైమ్ కూడా తగ్గిపోతుందని హెచ్ డీఎఫ్ సీ చెప్పింది. డిజిటల్2.0 కింద అదనపు ప్రొడక్టులను, సర్వీసులను లాంచ్ చేయాలని బ్యాంకు చూస్తోంది. దీనిలో తన కస్టమర్లకు, మర్చెంట్లకు కొత్త పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను అందించనుంది.
వార్షిక రిపోర్టులో భాగంగా షేర్ హోల్డర్స్‌ను ఉద్దేశించి ప్రసంగించిన బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ జగదీషన్ ఈ విషయాలను వెల్లడించారు. సరికొత్త కోర్ బ్యాంకింగ్ మాడ్యుల్స్‌ను రూపొందించేందుకు నూతన తరం స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద తన కోర్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి పేమెంట్స్ మాడ్యుల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్టు శశిధర్ చెప్పారు. ఈ మాడ్యుల్స్‌తో కోర్ బ్యాంకింగ్ అందుబాటులో లేకపోయినా.. పేమెంట్స్ డౌన్‌టైమ్‌ను తగ్గించనున్నామని పేర్కొన్నారు.
తన మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లను పునరుద్ధరించేందుకు బెంగళూరులో ఓ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసినట్టు శశిధర్ జగదీషన్ చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తవుతుందని, అధునాతన క్లౌడ్ ఆధారిత మొబైల్, నెట్‌బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను బ్యాంకు అందించనుందని తెలిపారు. డిజిటల్ ఫిన్‌టెక్ కంపెనీల మాదిరిగా ప్రతి 3 నుంచి 4 వారాలకు సరికొత్త పీచర్లను లాంచ్ చేయాలని బ్యాంకు భావిస్తోంది.
ఈ ఏడాది మార్చిలోనే బ్యాంకు డిజిటల్ వ్యాపార కార్యకలాపాలపై ఉన్న అన్ని ఆంక్షలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. బ్యాంకు సాంకేతికలో సమస్యలు రావడంతో డిసెంబర్ 2020లో హెచ్‌డీఎఫ్‌సీ కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ప్రస్తుతం ఎత్తివేసింది. రుణాలు, క్రెడిట్ కార్డులు, డిపాజిట్ ప్రొడక్టుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సరికొత్త భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకుంటోంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 1500 నుంచి 2 వేల బ్రాంచులను ఏర్పాటు చేయనున్నట్టు బ్యాంకు తెలిపింది.