శివసేన ఎప్పుడూ హిందుత్వం నుండి విడిపోలేదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. "మా ఊపిరిలో హిందుత్వ ఉంది. హిందుత్వానికి ఎవరు ఏం చేశారో మాట్లాడే సమయం ఇది కాదు" అని ఉద్ధవ్ థాకరే అన్నారు, "నేను బాలాసాహెబ్ హిందుత్వను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను." అంటూ ఉద్ధవ్ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో నెలకొన్న సంక్షోభం ముదురుతోంది. తాజా పరిణామాలపై సీఎం ఉద్ధవ్ థాక్రే ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూత్వ విషయంలో షిండే చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
అంతకు ముందు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే శివసేన హిందూత్వ రాజకీయాల్ని వదిలేస్తోందని ఆరోపించారు. అందుకే తాను శివసేనలోని ఇతర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. హిందూత్వను బలంగా విశ్వసించే బీజేపీతో కలిసి ముందుకు వెళ్దామని ఉద్ధవ్ కు ప్రతిపాదించారు. అయితే ఉద్ధవ్ ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో శివసేన కూటమిని చీల్చి మరీ బీజేపీకి మద్దతిచ్చేందుకు షిండే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ధాక్రే షిండే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.