ఇచ్చిన మాటకు కట్టుబడినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలసి 1998 నాటి డిఎస్సీ విజేతలు అభినందనలు తెలిపారు. ఏపీలో ఎప్పుడో 1998లో డీఎస్సీ రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూసి ఆశలు వదిలేసుకున్న వారికి ప్రభుత్వం తాజాగా ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగాలు రావనే నిర్ణయానికి వచ్చేసి వేర్వేరు వృత్తులు, వ్యాపారాలు, ఇతరత్రా వ్యాపకాల్లో స్ధిరపడిపోయిన 4567 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో వీరందరికీ ఇప్పుడు కొత్త ఊపిరివచ్చినట్లయింది.
1998 డీఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగాలు లభించని వారంతా ప్రభుత్వ నిర్ణయంపై సంతోషంగా ఉన్నారు. దీంతో వీరు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలిశారు. తమకు ఇన్నాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. దీంతో 1998 డీఎస్సీ అభ్యర్ధులు.. 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసి, సీఎంని సన్మానించారు.
డీఎస్సీ98లో అర్హత పొందిన వారికి ఉద్యోగం ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, 24 ఏళ్లనుంచి ఉన్న సమస్యను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే విస్వాసాన్ని నిలబెట్టుకున్నారన్నారు. నమ్ముకున్న వారికి సీఎం జగన్ న్యాయం చేసి నమ్మకాన్ని నిలబెట్టారని,1998 డీఎస్సీ అభ్యర్థులు సీఎం జగన్ కు రుణపడి ఉంటారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం 98 డీఎస్సీ వారికి అన్యాయం చేసిందని, సీఎం జగన్ మాకు న్యాయం చేశారని డీఎస్సీ1998అర్హత పొందిన అభ్యర్థి సోమశేఖర్ తెలిపారు. తమకు ఉద్యోగాలు ఇప్పించడంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఎంతో కృషి చేశారని, సీఎం జగన్ తమకు ప్రాణదాత, వారికి రుణపడి ఉంటామన్నారు. 24ఏళ్ల సమస్యను సీఎం జగన్ నెరవేర్చారని, 4567 మంది కుటుంబాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని మరో అభ్యర్ది ఎంఎం కోమలి సంతోషం వ్యక్తం చేశారు. దిక్కులేక రోడ్ల పై తిరుగుతోన్న తమకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు.