మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షులను నిందితులు భయపెడతున్నారని, వారికి బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు సీబీఐ తరఫు న్యాయవాది తెలియజేశారు. ఏ-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తన రాజకీయ పలుకుబడితో బెదిరిస్తున్నారని, వారినే కాకుండా సీబీఐ అధికారులకు కూడా బెదిరింపులు వెళుతున్నాయని సీబీఐ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. ఈరోజు వివేకా హత్యకేసుకు సంబంధించిన వాదనలు కోర్టులో జరిగాయి. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది పలు విషయాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రతిసారి సాక్షులను ప్రభావితం చేసేలా రాజకీయ పెద్దలతో తమకున్న పరిచయాలను తెలియజేసేలా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, ఇటువంటి సమయంలో వారికి బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. స్థానిక పోలీసులు కూడా సీబీఐ అధికారులకు విచారణలో సహకరించడంలేదని కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే విషయమై వివేకానందరెడ్డి కుమార్తె సునీత వాదనలను ఈనెల 27వ తేదీన వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.
కేసు దర్యాప్తులో భాగంగా కడప కేంద్ర కారాగారం నుంచి వస్తున్న సీబీఐ అధికారుల వాహనాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆపి డ్రైవర్‌ను బెదిరించిన సంగతి తెలిసిందే. అధికారులు పులివెందుల, కడప వదిలివెళ్లిపోవాలని హెచ్చరించినట్లుగా డ్రైవర్ కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. 27వ తేదీన వివేకా కుమార్తె సునీత కూడా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దనే అభిప్రాయాన్నే తెలియజేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.