యావత్తు ప్రపంచంలో వెబ్ సైట్లు గగ్గోలు పట్టించాయి. చాలా వెబ్ సైట్లు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీనికి కారణం సీడీఎన్ సర్వీస్ అందించే క్లౌడ్‌ఫ్లేర్ లో వచ్చిన సమస్యగా నిపుణులు పేర్కొంటున్నారు. మీ ఫేవరెట్ వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదా.. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తుందా.. అయితే ఎందుకో చూడండి. ప్రపంచవ్యాప్తంగా చాలా వెబ్‌సైట్‌లు నిలిచిపోయాయి. ఒక్కసారిగా ఇంటర్నెట్ ఔటేజ్ ఏర్పడింది. వెబ్‌సైట్‌లను ఓపెన్ చేస్తే ‘500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ’ అని చూపిస్తోంది. జెరోధా కు చెందిన ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కైట్ కూడా కాసేపు నిలిచిపోయింది. డిస్కోర్డ్, మైన్‌క్రాఫ్ట్, కాన్వా, డోర్‌డ్యాష్, నార్డ్ పీవీఎన్, ఫీడ్లీ, లీగ్ ఆఫ్ లెజెండ్స్‌తో పాటు చాలా సర్వీస్‌లు పని చేయలేదు. మీడియమ్.కామ్, న్యూస్ ఔట్‌లెటర్ రిజిస్టర్, గ్రో, బఫర్, ఐస్పిరిట్, అప్‌స్టాక్స్, సోషల్ బ్లేడ్‌తో పాటు అనేక పాపులర్ వెబ్‌సైట్‌లు కూడా కాసేపు ఎర్రర్ చూపించాయి.
కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (సీడీఎన్) సర్వీస్ అందించే క్లౌడ్‌ఫ్లేర్ లో వచ్చిన సమస్య కారణంగానే ఇలా వెబ్‌సైట్‌ల సర్వీస్ నిలిచిపోయింది. ప్రపంచంలోని చాలా వెబ్‌సైట్‌లు క్లౌడ్‌ఫ్లేర్ సీడీఎన్ ఆధారంగానే పని చేస్తున్నాయి.
ఇలా చాలా వెబ్‌సైట్‌లు డౌన్ అయిన వెంటనే క్లౌడ్‌ఫ్లేర్ స్పందించింది. తమ సీడీఎన్ సర్వీస్‌లో సమస్య వచ్చిందని ధ్రువీకరించింది. సమస్య ఏంటో గుర్తించామని, ఇప్పటికే ఫిక్స్ చేస్తున్నామని వెల్లడించింది. ప్రభావం పడిన వెబ్‌సైట్‌లకు ఇది వర్తించేందుకు కాస్త సమయం పట్టవచ్చని పేర్కొంది. “ప్రస్తుత సర్వీస్ సమస్యను క్లౌడ్‌ఫేర్ టీమ్ గుర్తించింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. ఫిక్స్‌లను కూడా వర్తింపజేస్తున్నాం” అని క్లౌడ్‌ఫ్లేర్ పేర్కొంది.
డౌన్ అయిన చాలా వెబ్‌సైట్‌లు మళ్లీ పని చేస్తున్నాయి. క్లౌడ్‌ఫ్లేర్ సమస్యను ఫిక్స్ చేసిన తర్వాత యథావిధిగా సర్వీస్‌లు మొదలయ్యాయి. ఇప్పటికే జెరోధాకు చెందిన కైట్‌తో పాటు చాలా సర్వీస్‌లు రీస్టార్ట్ అయ్యాయి.ఇంటర్నెట్ ఔటేజ్‌ను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ కూడా ఈ సమస్యను గుర్తించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లోనూ కాసేపు ఈ సమస్య తలెత్తిందని దాని ద్వారా తెలిసింది.