తిరుపతి జిల్లా, పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీవకుళామాత ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని తొలిదర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవకుళామాత ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటిన అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి.. వకుళామాత దేవాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీవకుళామాత అమ్మవారిని ముఖ్యమంత్రి తొలిదర్శనం తొలి దర్శనం చేసుకొని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు సీఎం వైయస్ జగన్‌కు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ నిర్వాహకులను సీఎం ఘనంగా సత్కరించారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు.