ఈ నెల 27 న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా యంత్రాంగంతో గురువారం సమావేశమై పలు సూచనలు స్పష్టమైన రీతిలో చేశారు. ముఖ్యంగా సీఎం పర్యటన సందర్భంగా ఏమరపాటు తగదని, ఏర్పాట్ల విషయమై జాగ్రత్త వహించాలని దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణం అయిన కేఆర్ స్టేడియంలో సీఎం ప్రసంగిస్తారు కనుక ఆయన భావజాలం ఇక్కడికి వచ్చే లబ్ధిదారులకూ, ఇతర ప్రజానీకానికీ చేరే విధంగా ఏర్పాట్లు ఉండాలని కోరారు. "సంక్షేమ పథకాల అమలు వెనుక విస్తృత భావ జాలం ఉంది. దానికి అనుగుణంగానే, నేను గతంలో శాసన సభలో మాట్లాడాను. దేశంలోనే మన రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా బ్రిటిషర్ల కాలం నుంచి మనం వ్యవసాయ రంగ పరంగా కూడా వృద్ధిలోనే ఉన్నాం. కానీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాం. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో అక్షరాస్యతలో మనం 22వ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ కు మాత్రమే విద్యావకాశాలు నిన్నమొన్నటి దాకా అందేవి. కానీ అందరికీ విద్యావకాశాలు అందించేందుకు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు గత ప్రభుత్వాల హయాంలో ఈ 75 ఏళ్లలో తీసుకున్న చర్యలు తక్కువ. ఆ నేపథ్యం నుంచి చూస్తే అమ్మ ఒడి కార్యక్రమం ప్రాధాన్యం ఏంటన్నది అందరికీ అర్థం అవుతుంది. అంతేకాదు ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు షూ దగ్గర నుంచి, యూనిఫాం దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి ఇలా ప్రతి అంశంపై కూడా శ్రద్ధ తీసుకుని బడులను ఆధునికీకరించి, మంచి చదువులు అందించాలన్న బాధ్యతతో పనిచేస్తున్నాం. ఇలాంటివాటి కోసం దేశంలో చాలా పోరాటాలు జరిగాయి. ఉద్యమాలు జరిగాయి. అవేవీ లేకుండా నిశ్శబ్దంగా పిల్లలకు అందాల్సినవన్నీ అందించేందుకు, నేరుగా వారికి ఆర్థిక లబ్ధి దక్కేందుకు కృషి చేస్తున్నాం. ఇది ఓట్లు తెచ్చుకునే కార్యక్రమమో లేకా ఇంకొకటో అనుకుంటే విపక్షాల వారికి సరైన అవగాహన లేదని భావించాలి. ఇలాంటి ప్రొగ్రాం నా నియోజకవర్గంలో పెడుతున్నప్పుడు., సీఎం ఏరి కోరి నా నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు నేను బాధ్యతగా ఉండాలి. నాతో పాటు మీరు కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు నిర్వర్తించాలి. ఎవ్వరూ కూడా వైఫల్యం చెందేందుకు వీల్లేదు. బాధ్యత తీసుకున్నాక తూతూమంత్రంగా చేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఆ విధంగా నేను మాట పడేందుకు అయితే సిద్ధంగా లేను. సీఎం చెప్పే మాటలను అంతా శ్రద్ధగా విన్నారు అంటే ప్రొగ్రాం సక్సెస్. అందుకు అనుగుణంగా సభకు వచ్చే వారిని క్రమశిక్షణాయుత వాతావరణంలోఉండే విధంగా చేయగలగాలి. ప్రతి విషయాన్ని నేను స్టడీ చేస్తుంటాను. అధికారుల పనితీరును అంచనా వేస్తాను. సీఎం మన దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేడియం పనులకు రూ.10 కోట్లు నిధులు వెచ్చించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి సీఎం ఓ ప్రకటన కూడా చేయనున్నారు. అందుకే అన్ని క్రీడా అసోసియేషన్లనూ సభకు రప్పించండి..." అని అన్నారు . కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, ఎస్పీ జి.ఆర్.రాధిక, జాయింట్ కలెక్టర్ ఎమ్. విజయ సునీత, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీనివాసరావు, డీఎస్పీ మహేంద్ర, ముఖ్య శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.