తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు ఎంతమాత్రం శివసేనలో ఉండేందుకు అర్హులు కారని ఆదిత్య థాకరే స్పష్టం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేల ముందు ఇకపై రెండే ఆప్షన్లు ఉన్నాయని, ఒకటి బీజేపీలో చేరడమా, రెండు ప్రహార్ లో చేరడమా అనేది తేల్చుకోవాలని అన్నారు. రెబెల్ గ్రూప్ లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు తాము కిడ్నాప్ కు గురైనట్టు, బీజేపీ పాలిత అసోంలో బందీలుగా ఉన్నామని భావిస్తున్నారని వెల్లడించారు. కొందరిని బలవంతంగా బస్సుల్లోకి తోసినట్టు జాతీయ మీడియాలో దృశ్యాలు కనిపించాయని ఆదిత్య థాకరే పేర్కొన్నారు. శివసేన యువజన విభాగంతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో పుట్టిన ముసలం కొనసాగుతోంది. మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చుతూ 40 మందికి పైగా ఎమ్మెల్యేలను అసోంలోని గువాహటి తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలతో కాక పుట్టిస్తున్నారు. అయితే, రెబెల్ వర్గంలోని 20 మంది ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ థాకరేతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మంత్రి ఆదిత్య థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.