కరోనా లాక్డౌన్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనటంతో తిరుమల శ్రీవారి హుండీకి ఆదాయం రికార్డు స్థాయిలో వస్తోంది. గత 4 నెలలుగా ప్రతినెలా హుండీ ఆదాయం రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ఈ ఏడాది మే నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.129.93 కోట్లు వచ్చాయి. ఇక జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.