విద్యాశాఖలో నాడు-నేడు, డిజిజల్ లెర్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్ అందించడంపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. అలాగే సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇస్తామని, ఆ ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేయాలని తెలిపారు. దీనికి తగినట్టుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలన్నారు ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొన్నారు.. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలని తెలిపారు. అందుకే నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమని, ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.