శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండే పాలన పగ్గాలు చేపట్టిన కొద్ది సమయంలోనే నాటి ఉద్దమ్ థాక్రే నిర్ణయానికి భిన్నంగా నిర్ణయం తీసుకొన్నారు. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాజకీయ ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే.. తన మాజీ బాస్‌కు వ్యతిరేకంగా తొలి నిర్ణయం తీసుకున్నారు. మెట్రో కార్‌షెడ్‌పై ఉద్ధవ్ థాక్రే నిర్ణయాన్ని పక్కనబెట్టి.. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని నిర్ణయించారు. గురువారం (జూన్ 30) రాత్రి షిండే ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధానంగా ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలో 2019లో ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ఇందుకోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతి కూడా తీసుకుంది. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లను నరకాల్సి రావడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పర్యావరణ కార్యకర్తలతో పాటు ఉద్ధవ్ థాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే కూడా పాల్గొన్నారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ, ఫలితాల అనంతరం బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి కూటమి (మహా వికాస్ అఘాడీ) కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 నవంబరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘మెట్రో కార్ షెడ్’పై ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును ఆరే కాలనీ నుంచి కంజూర్‌మార్గ్‌కు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరే కాలనీని రిజర్వ్ అటవీ ప్రాంతంగా ప్రకటించింది.
ఉద్ధవ్ థాక్రే సర్కార్ నిర్ణయంపై కేంద్రం అభ్యంతరం చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, రాష్ట్రంతో సంబంధం లేదని న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై బాంబే హైకోర్టే స్టే విధించింది. నాటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. తాజాగా బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది గంటల్లోనే.. పాత ప్రాజెక్టును తిరిగి తెరపైకి తీసుకురావడం గమనార్హం.
మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును కంజూర్‌మార్గ్‌కు బదులుగా ఆరే కాలనీలోనే చేపట్టాలని కొత్త ప్రభుత్వం ప్రతిపాదన చేస్తున్నట్లుగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు. దీంతోపాటు థాక్రే ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జలయుక్త్ శివిర్’ పథకాన్ని కూడా నిలిపివేయాలని అధికారులను ఫడ్నవీస్ ఆదేశించారు. ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, తక్షణం నిలిపివేయాలని ఫడ్నవీస్ ఆదేశించినట్లు సమాచారం.