కాలం ఎంతవేగంగా పరిగెడుతున్నా...మానవత్వమున్న వారు అంతరించిపోతున్నా...ప్రతి మనిషికి ఓ మనస్సు ఉంటుందన్నది గ్రహించాలి. తన ఉపాధి పోయింది అంటే ఆ మనిషి మనస్సు పడే అంతర్మథనం ఏపాటిదో ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ప్రపంచ కుబేరుడు టెస్లా కంపెనీ ఇటీవల తన ఉద్యోగుల్లో 10 శాతం మంది తీసేసింది. ఈ లేఆఫ్‌లలో భాగంగా జాబ్‌ను పోగొట్టుకున్న ఉద్యోగులు తమ వేదనను సోషల్ మీడియా వేదిగా పంచుకుంటున్నారు. టెస్లాలో పనిచేసి, ఉద్యోగం కోల్పోయిన టెక్సాస్‌కు చెందిన క్విషాన్ వాకర్ అనే వ్యక్తి షేర్ చేసిన స్టోరీ ప్రతి ఒక్కర్ని కంటితడి పెట్టేలా చేస్తోంది. ఉద్యోగంలో చేరిన రెండు నెలల్లోనే వాకర్ తన డ్రీమ్ జాబ్‌ని కోల్పోయాడు. ఆర్థిక వ్యవస్థ బాగోలేకపోవడంతో లేఆఫ్స్ తప్పనిసరి అవుతుందంటూ ఎలన్ మస్క్ ప్రకటించిన ఉద్యోగాల కోతలో వాకర్ కూడా ఉన్నాడు. వాకర్ తన కలల ఉద్యోగం కోల్పోయినట్టు లింక్డిన్ పోస్టులో వెల్లడించాడు. వాకర్ మాదిరి చాలా మంది కూడా తమ స్టోరీలను లింక్డిన్‌లో షేర్ చేసుకుంటూ.. తమ వేదనను చెప్పుకుంటున్నారు. కొత్త ఉద్యోగానికి కనెక్ట్ అవుతున్నారు.
తన మేనేజర్, హెచ్‌ఆర్‌తో జరిగిన మీటింగ్‌లో జూన్‌లో తన ఉద్యోగం పోయినట్టు తెలిసిందని వాకర్ తెలిపాడు. ఆ మీటింగ్‌లో తన టర్మినేషన్ గురించి చెప్పినట్టు వెల్లడించాడు. ‘నాకు తెలుసు అది వాళ్ల తప్పు కాదు. కానీ నా బాధను బయట పడకుండా ఉండేందుకు ఆ సమావేశంలో ఎంతో ట్రై చేశాను. కాల్ కట్ అయిన వెంటనే నా కన్నీళ్లు ఒక్క క్షణం కూడా ఆగలేదు. వెక్కివెక్కి ఏడ్చేశాను. నిజంగా అదెంతో బాధాకరమైన క్షణం. నా కలల ఉద్యోగాన్ని రెండు నెలల్లోనే నేను కోల్పోయాను’ అంటూ వాకర్ చెప్పారు.
వాకర్‌కు ఆ కాల్ ఎండ్ అయిన నిమిషాల వ్యవధిలోనే టెస్లా ఈమెయిల్ అకౌంట్ డియాక్టివేట్ అయినట్టు తెలిపాడు. నిమిషాల్లోనే ఇదంతా జరగడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని వాకర్ వివరించాడు. ప్రతి యాక్సస్‌ను తాను కోల్పోయినట్టు వాకర్ చెప్పాడు. మరో మాజీ టెస్లా ఉద్యోగి కూడా తనకు ఎదురైన ఇదే అనుభవాన్ని పంచుకున్నాడు. 2018లో కూడా తనను అలానే ట్రీట్ చేసినట్టు తెలిపాడు.
‘వాళ్లు కేవలం ల్యాప్‌టాప్ నుంచి స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతారు. టెస్లాతో మనకున్న అనుబంధాలన్ని ఒక్కసారిగా మనం యాక్సస్ కోల్పోతాం. నా ఫోన్‌కు, కంప్యూటర్‌కి వెంటనే యాక్సస్ కట్ చేశారు. ఎలన్ మస్క్‌కి ఈ విషయంపై మెయిల్ చేసినా.. కనీసం స్పందన లేదు. అది నా డ్రీమ్ జాబ్. ’ అని చెప్పాడు.
వాకర్ లింక్డిన్ పోస్టుకు తన మాజీ కొలీగ్స్ నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ‘నా అద్భుతమైన టీమ్‌కి పెద్ద థ్యాంక్సూ. వారితో కలిసి పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం నాకు కలిగిన బాధకు ఓకే. మళ్లీ నేను తిరిగి కోలుకుంటాను’ అని వాకర్ తెలిపాడు.