ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నంత భద్రతా నేడు ఏ ప్రైవేటు ఉద్యోగంలోనూ లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయంను కేంద్రం తీసుకొంది. ఉద్యోగి తన జాబ్‌కి రిజైన్ చేసినా లేదా సర్వీసు నుంచి తొలగించబడినా చివరి వర్కింగ్ డే నుంచి రెండు రోజుల్లో ఆ ఉద్యోగికి పూర్తి వేతన పేమెంట్లను కంపెనీలు చేయాలి. కొత్త వేతన చట్టం ప్రకారం ఈ నిబంధనను కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రస్తుతం ఉద్యోగులు జాబ్ మానేసిన తర్వాత వారి వేతన, ఇతర బకాయిల సెటిల్‌మెంట్లకు కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల సమయం పడుతుంది. కొన్ని సార్లు ఉద్యోగి చివరి వర్కింగ్ డే నుంచి 90 రోజులపైననే ఈ సెటిల్‌మెంట్లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలో దేశంలో అమల్లోకి రాబోతున్న వేతన కోడ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలను తీసుకొస్తుంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు సంబంధించి నాలుగు కోడ్‌లకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సైతం ఈ చట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమల వివాదాలు, సామాజిక భద్రత, వేతనం, వృత్తి భద్రతలకు సంబంధించిన ఈ నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతుంది.
కార్మిక చట్టాల్లో భాగంగా తీసుకొచ్చే కొత్త వేతన కోడ్ కింద.. ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించినా లేదా డిస్‌మిస్ చేసినా లేదా ఉద్యోగే జాబ్‌కి రిజైన్ చేసినా వారి లాస్ట్ వర్కింగ్ డే నుంచి రెండు రోజుల్లో వేతన పేమెంట్లను చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు ఈ నెల 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్రాలతో సంప్రదింపులు ఇంకా జరుగుతుండటంతో.. ఈ చట్టాల అమలు మరికొంత ఆలస్యమవుతుంది. ఈ నాలుగు కార్మిక చట్టాలకు అనుగుణంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందించాయి.
కొత్త వేతన చట్టం అమల్లోకి వస్తే.. కంపెనీలు తప్పనిసరిగా తమ పేరోల్ విధానాన్ని దానికి అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. మార్చిన నిబంధనల ప్రకారం లాస్ట్ వర్కింగ్ డే నుంచి రెండు రోజుల్లో సెటిల్‌మెంట్లు పూర్తవ్వాలి. కొత్త చట్టాల ప్రకారం, కంపెనీల వర్కింగ్ అవర్స్ కూడా రోజుల్లో 12 గంటలకు పెరుగుతున్నాయి. ఉద్యోగులకు మూడు రోజులు వీక్లీ ఆఫ్స్ లభించబోతున్నాయి. వర్కింగ్ అవర్స్‌కి ఇబ్బంది లేకుండా.. వారంలో నాలుగు రోజులే పని దినాలను ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కొత్త వేతన చట్టం ప్రకారం వారంలో 48 గంటలు తప్పనిసరి.