ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడమే టార్గెట్ పెట్టుకొన్న రష్యా అందుకు అనుగుణంగా దాడులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో కీలకమైన డోన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించామని రష్యా ప్రకటించింది. కీలకమైన లూహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే రష్యాకు సరిహద్దుగా ఉన్న ఉక్రెయిన్ ప్రాంతం డోన్బాస్ ను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. డోన్బాస్ లోని లూహాన్స్క్, డోనెట్స్స్ రీజియన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ ఇప్పటికే రష్యా మద్దతుతో వేర్పాటు వాదులు ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలపై పోరాడుతున్నారు. వారితోపాటు రష్యా కూడా పెద్ద సంఖ్యలో దళాలతో కలిసి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటోంది. ‘‘రష్యా దళాలు, లూహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ యూనిట్లు లిసిచాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో శత్రువును పూర్తి స్థాయిలో తరిమి కొట్టి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి” అని తన ప్రకటనలో పేర్కొంది.
లిసిచాన్స్క్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పూర్తిగా మోహరించి మొత్తంగా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత నగరమైన ఖార్ఖీవ్ లో ఉక్రెయిన్ మిలటరీ స్థావరంపై దాడి చేశామని.. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని మైకోలేవ్ నగర శివార్లలో ఉన్న విదేశీ విమానాల స్థావరాన్నీ నేలమట్టం చేశామని ప్రకటించింది.