పాకిస్తాన్ లో బస్సు ప్రయాణాలు మనషుల ప్రాణాలను హరించేస్తున్నాయి. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ప్రయాణికుల బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా బస్సు జోబ్ వద్ద లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షంలో వేగంగా వెళ్లడంతోనే అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. " బస్సు క్వెట్టా సమీపంలోకి రాగానే అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. మేము ఇప్పటివరకు 19 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. 11 మంది గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు." అని అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ మెహతాబ్ షా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని షా తెలిపారు.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సివిల్ ఆస్పత్రి జోబ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నూరుల్ హక్ తెలిపారు. ఈ ఘటనపై బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని చికిత్స వేగవంతంగా అందించాలని సూచించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ ఘోర ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యసహాయం అందించాలని సంబంధిత అధికారులను ప్రధాని ఆదేశించారు. గత నెలలో ఉత్తర బలూచిస్తాన్‌లోని ఖిలా సైఫుల్లా జిల్లా సమీపంలో ప్రయాణికుల వ్యాన్ లోయలో పడిపోయింది. ఆ ఘటనలో ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో సహా 22 మంది చనిపోయారు. దీంతో పాకిస్థాన్‌లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలను పట్టించుకోకపోవడంతో వాహనాల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.