ఏ రాష్ట్రం వెళ్లినా, ప్రాంతానికివెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక భాషా, యాస, సంప్రదాయాలలో ఒదిగిపోతారు. ఏపీలోనూ ప్రధాని నరేంద్ర మోడీ అదే తరహా ఒరవడిని కొనసాగించారు. తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగంతో అదరగొట్టారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ అన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అంటూ కొనియాడారు.
రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు అన్నారు ప్రధాని. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని.. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీకగా అభివర్ణించారు. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని.. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని ప్రశంసించారు. 'మనదే రాజ్యం' నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారని.. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
యావత్ భారతదేశం తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తుందన్నారు ప్రధాని ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక అని.. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు. స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను స్మరించుకుంటున్నామని.. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa