తప్పు చేస్తే చర్యలు తీసుకొనేందుకు చట్టాలున్నాయి. కానీ కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మాత్రం మానడంలేదు. మరీ ముఖ్యంగా గ్రామాలో, గిరిజన ప్రాంతాలలో ఈ తంతు యథేచ్చగా సాగుతోంది. మధ్యప్రదేశ్‌లో అనాగరిక చర్య చోటుచేసుకుంది. స్థానికులు ఓ గిరిజన మహిళపై అమానుషంగా ప్రవర్తించారు. వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో బహిరంగంగా దాడి చేశారు. కిరాతకంగా అవమానించారు. ఈ దారుణమైన ఘటన దేవాస్ జిల్లాలోని బోర్‌పదవ్ గ్రామంలో ఆదివారం జరిగింది. నిజానికి గ్రామంలోని ఓ వ్యక్తి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆమె అదే గ్రామంలో తన ప్రియుడితో కనిపించింది.
దాంతో స్థానికులు తీవ్రమైన శిక్ష వేశారు. ముగ్గురు పిల్లలున్న ఆమెను పాక్షికంగా బట్టలు విప్పించి.. బెల్ట్‌తో కొట్టారు. కిందపడేసి హింసించారు. బూట్ల దండవేశారు. ఆమె తన భర్తను భుజాలపై మోసుకుని ఊరంతా తిరిగేలా దారుణమైన శిక్ష విధించారు. ఆమె అందరి ముందు తన భర్తను భుజంపై పెట్టుకుని గ్రామం చుట్టూ తిరగవలసి వచ్చింది. ఆమెపై దాడి జరిగినప్పుడు ఆమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నారు.
అయితే అలా జరిగినప్పుడు స్థానికులు సైతం ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. ఒక వృద్ధ జంట మాత్రం ఆ మహిళను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిన సుమారు 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మహిళ స్నేహితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో దాడికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తనకు 15 ఏళ్ల వయస్సులో వివాహమైందని... తన భర్త తనను వేధించేవాడని.. అందుకే ఇంటి నుంచి పారిపోయాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.