ఎపుడు ఏదో ఒక కొత్త విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు తెలిపే ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్రా తాజా ట్విట్ తో నెటిజన్లే ఆయనకు ఓ అమూల్య సలహా అందించారు. ట్విట్టర్లో తనను ఫాలో అయ్యే వారి కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, భిన్న అభిరుచులు కలిగిన ఆనంద్ మహీంద్రా.. మరో వినూత్న వాహనాన్ని పరిచయం చేశారు. ఈ వాహనం మహీంద్రా కంపెనీది కాదనుకోండి. డైనింగ్ టేబుల్ పై నలుగురు కూర్చుని డిషెస్ ను ఇష్టంగా ఆరగిస్తున్నారు. ఈ టేబుల్ కు కింద చక్రాలు ఉన్నాయి. బటన్ నొక్కితే అది వాహనం మాదిరిగా ప్రయాణిస్తోంది. తింటూనే పెట్రోల్ బంక్ కు వెళ్లి ఇంధనం నింపుకోవడాన్ని వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ.. ‘‘ఇది ఈ- మొబిలిటీ. ఇక్కడ ఈ అంటే ఈట్ (తినేది) అని అర్థం’’ అంటూ ఆయన సరదాగా క్యాప్షన్ పెట్టారు. ఇప్పటికే ఈ వీడియోను 26 లక్షల మంది వీక్షించారు. అయితే ఇది ఏ ప్రాంతానికి చెందినదనే వివరాలు లేవు.
ఆనంద్ మహీంద్రా వినూత్నమైన, కొత్త అంశాలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తుంటారు. ట్విట్టర్లో తనను అనుసరించే 94 లక్షల మందికి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను పరిచయం చేస్తుంటారు. తాజా వీడియోను చూసిన కొందరు ఫాలోవర్లు.. 'అయ్యా ఆనంద్ గారూ మీరు కూడా ఇలాంటి వాహనం తయారు చేయవచ్చుగా' అంటూ సరదా సూచన చేశారు.