ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం భేటీ అయ్యింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈఓ, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్‌కరన్ బృందం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ జి.శేఖర్ బాబు ఉన్నారు.
ఈ సందర్భంగా.. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో భాగస్వామ్యం కావాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, అలాంటి రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్‌ను పొందుపరచాలని సీఎం వైయస్ జగన్ కోరారు. ఈ మోడల్‌ను ఖరారుచేయగానే రాష్ట్రంలో కూడా అమలుకు కేంద్రంతో కలిసి భాగస్వామ్యం అవుతామని సీఎం తెలిపారు.