రాజ్యసభ.. అంటే పెద్దల సభ. ఇందుకు ఇళయ రాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, శ్రీమతి పి.టి.ఉష సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వీరికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. స్వరజ్ఞాని ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు వీరేంద్ర హెగ్గడే, పరుగుల రాణి శ్రీమతి పి.టి.ఉష.. తమ రంగాల్లో మన దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసిన స్రష్టలు. వీరి సేవలు, అనుభవాన్ని సముచితరీతిన గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర నాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను. పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ది కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరతాయి అని కొన్ని పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం. ఇటువంటి ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నాను అని తెలియజేసారు.