ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఐదేళ్ల మూడు నెలలపాటు మాత్రమే పని చేశారు. కానీ.. ఆ కొద్ది కాలంలోనే పాలకుడికి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సమగ్రాభివృద్ధివైపు ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు.
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైయస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు.
రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో దివంగత వైఎస్సార్ ముందు వరుసలో నిలుస్తారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్‌కి, ఆ తర్వాత మళ్లీ పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాలు సాధించారు.