జన్మంతా జనం బాగు కోసమే పరితపించిన నిస్వార్థ సేవకుడు. తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో అభిమాన కోటలు కట్టుకున్న కారణజన్ముడు. భావితరాల భవిష్యత్తు కోసం పూలదారులు పరిచిన దార్శనికుడు. ప్రజల సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కున్న నాయకుడు. తన ఐదేళ్ల పాలనలోనే అద్భుతాలు చేసి.. జనహృదయ నేతగా నిలిచారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి. వైయస్ రాజశేఖరరెడ్డి (వైయస్ఆర్).. ఈపేరు తెలుగు నేలపై ఆకుపచ్చని జ్ఞాపకం. ప్రజాసేవకు అసలు సిసలు నిర్వచనం. కోట్లాది గుండెల్లో కొలువైన అరుదైన రూపం. ఇంకో వందేళ్లయినా సరే సాటి మనిషికి సాయమందితే గుర్తుకొచ్చేది వైయస్‌ఆరే. ప్రజా సంక్షేమం మాట వినపడితే గుర్తుకొచ్చేది రాజన్నే. పేద గుండెకు అన్ని విధాల బతుకు భరోసా దొరికితే, పేద బిడ్డ పెద్ద చదువుల కల నిజమైతే గుర్తుకొచ్చేది మన రాజశేఖరుడే. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావడంతో వైసీపీ శ్రేణుల్లో కోలాహలం నిండింది. వైయస్ఆర్ పుట్టిన రోజుని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం గా పరిగణించారు.