ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీనబాబు, అనంతపురం దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులులు సంయుక్తంగా పేర్కొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాంటి ర్యాగింగ్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీరు మాట్లాడారు. విద్యా సంస్థలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ర్యాగింగ్ ను ప్రోత్సహించినా, ఎవరినైనా అవమానించినా చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. ఏ చర్య ద్వారానైనా ఒక విద్యార్ధికి అవమానం లేదా భయం కలగడం,అవహేళనలకు గురైనందువల్ల గౌరవభంగం కలిగినా ర్యాగింగ్ నేరంగా పరిగణించబడుతుందన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే ఎలాంటి శిక్షలు,జరిమానాలు ఉంటాయి & ర్యాగింగ్ జరుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన చేశారు.