ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ టార్గెట్ కుప్పం..అక్కడ బాబును ఓడిస్తే టీడీపీ సగం ఫినిష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 03:06 AM

టీడీపీని పూర్తిగా నెలమట్టం చేయాలని భావిస్తున్న వైసీపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమియే ధ్యేయంగా పావులు కదుపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుణ్ని ఈసారి ఎలాగైనా కుప్పంలో ఓడించాలనే పట్టుదలతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లుగా వ్యూహరచనలు చేస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వరుసగా ఏడుసార్లు విజయకేతనం ఎగరవేసిన చంద్రబాబును ఓడించగలిగితే తెలుగుదేశం పార్టీని సగం ఓడించినట్లేననే భావనలో వైసీపీ అధిష్టానం ఉంది. అందుకు తగ్గట్లుగా బాబుపై పోటీచేయడానికి బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది. స్థానికంగా టీడీపీని నిర్వీర్యం చేయాలని.. బాబును ఓడించాలంటే ముందుగా స్థానికంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలందరినీ వైసీపీలో చేర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. తర్వాత వ్యూహాత్మకంగా తెలుగు, తమిళ సినిమాల కథానాయకుడు విశాల్ పేరు తెరపైకి తెచ్చారు. తాను సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నానని, ఆ వార్తలన్నీ అభూత కల్పనలేనంటూ వస్తున్న వార్తలను విశాల్ కొట్టిపారేశారు. ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈసారి భరత్ పోటీచేస్తారా? లేదంటే అధిష్టానం దృష్టిలో వేరే వ్యక్తి ఉన్నారా? వ్యూహాత్మకంగా చివరిలో ప్రకటించే అవకాశం ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ పోయినా కుప్పం లో గెలవాలని వైసీపీ? మహానాడు నిర్వహించకముందు చంద్రబాబు బాదుడే బాదుడు పేరుతో రాయ‌ల‌సీమ‌లో విస్త్రతంగా ప‌ర్య‌టించారు. ఆయన పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో అప్రమత్తమైన అధికార పార్టీ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిసారించాల‌నే వ్యూహాన్ని అమ‌లు చేస్తోంది. తాజాగా తెరపైకి కొత్తపేరు వచ్చింది. ఆయనే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు. ప్రస్తుతం కుప్పంలో భరత్ పనిచేసుకుపోతున్నారు. నాయకులందరినీ వైసీపీలో చేర్చుకుంటూ బలోపేతమవుతున్నారు. ఒకవేళ భరత్ చంద్రబాబుముందు సరితూగలేరు అనుకుంటే చివరి నిముషంలో ద్వారకనాథరెడ్డిని బరిలోకి నిలిపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీకి సిద్ధమవుతున్న ద్వారకనాథరెడ్డి? మదనపల్లెలో చంద్రబాబు పర్యటించిన రెండురోజుల తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడిన ద్వారకనాథరెడ్డి చంద్రబాబు విమర్శలను ఖండించారు. మహానాడుకు వెళ్లకుండా తాము ఎవరినీ అడ్డుకోలేదన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడంవల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, చంద్రబాబు రాజీనామా చేసి కుప్పంలోకానీ, తంబళ్లపల్లెలోకానీ తనపై పోటీచేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఎక్కడ పోటీచేసినా డిపాజిట్లు కూడా దక్కనీయకుండా చేస్తామన్నారు. తమ కుటుంబం కష్టంతో పైకి వచ్చిన కుటుంబమని ద్వారకనాథరెడ్డి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa