మాన్‌సూన్ సీజన్ మనకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు వర్షపు నీటిలో ఆడుకునేలా చిన్నచిన్న ఆనందాలను తీసుకువస్తుంది. అలాగే రుచికరమైన ఆహారాలను మనకు అందిస్తోంది. సాయంత్రం వేళలో చినుకులు కురుస్తున్న సమయంలో చల్లటి పిల్లగాలులు వీస్తుండగా వేడివేడి పకోడి, సమోసా లాంటివి తింటూ ఉంటే, గరం చాయ్ తాగుతూ ఉంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
మరి రోజూ పకోడినే తినలేము కదా? రోజుకో వెరైటీ తినాలనిపిస్తుంది. ఒకరోజు మోమోస్, మరోరోజు మిర్చి బజ్జీలు, ఇంకోరోజు బ్రెడ్ కట్లెట్లు ఇలా రోజుకో రుచిని మనకు ఆస్వాదించే అవకాశం ఉంది. ఆ రెసిపీలన్నీ మీకు ఇదివరకే పరిచయం చేశాం కూడా. మరి ఈరోజు మరో సరికొత్త రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఆ రెసిపీ ఏమిటంటే చికెన్ వడ. మీరు చికెన్ పకోడిలు, ఫిష్ పకోడిలు, మినపవడలు, మక్కవడలు తినే ఉంటారు. మరి చికెన్ వడలు ఎప్పుడైనా తిన్నారా? సాయంత్రం వేళ చికెన్ వడలు తింటుంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇవి మంచి పార్టీ స్టార్టర్స్ గా కూడా ఉంటాయి. మరి చికెన్ వడలు ఎలా తయారు చేసుకోవాలి. ఏమేం కావాలి ఆ రెసిపీని మీకు ఇక్కడ అందిస్తున్నాం. ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:
250 గ్రాములు చికెన్ కీమా
1 టీస్పూన్ వెల్లుల్లి
1 బంగాళాదుంప
1 ఉల్లిపాయ ముక్కలు
1 క్యారెట్
పావు టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్
1/2 స్పూన్ కారం
1/4 స్పూన్ ఉప్పు
1/4 tsp జీలకర్ర పొడి
చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్
మైదా పిండి
1 గుడ్డు
బ్రెడ్ ముక్కలు
తాజా కొత్తిమీర
నూనె
తయారీ విధానం:
ముందుగా చికెన్, వెల్లుల్లి, బ్రెడ్ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంపలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్, మిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి, కొత్తిమీర. వీటన్నింటిని ఒక బ్లెండర్ జార్ లోకి తీసుకొని మెత్తని పేస్టుగా చేసుకోండి.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మొత్తం నూనె పూయండి (అంటుకోకుండా ఉండటానికి). అనంతరం చికెన్ పేస్ట్‌ను వడల ఆకృతిలో చేసుకొని ప్లేట్‌లో ఉంచండి.
ఇప్పుడు పచ్చి చికెన్ వడలను 2-3 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి.
ఆ తర్వాత పాన్‌లో నూనె వేడి చేయండి. అలాగే ఒక గిన్నెల్లో గిలకొట్టిన గుడ్డు, మరో గిన్నెలో మైదాపిండిని సిద్ధంగా ఉంచుకోండి.
అనంతరం ఫ్రీజ్ చేసిన చికెన్ వడలను గిలకొట్టిన గుడ్డులో, ఆ తర్వాత మైదాపిండిలో ముంచి ఆపై నూనెలో వేయండి. క్రిస్పీగా, బంగారు రంగులోకి మారేంతవరకు డీప్ ఫ్రై చేయండి.
అంతే, రుచికరమైన చికెన్ వడలు రెడీ అయినట్లే. వీటికి ఉన్న నూనెను ఒక టిష్యూ పేపర్ తో అద్ది. సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వావ్ వాటే టేస్ట్ అనక మానరు.