భారీ వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్ క్షేత్రం వద్ద చిక్కుకున్న భక్తులు తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాగం రంగంలోకి దిగింది. ఇదిలావుంటే దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో వరద బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా... మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ బృందాలు సహాయచర్యలు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమర్‌నాథ్‌లో వరద బీభత్సం సృష్టించిన సమయంలో 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఉండటంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి అమర్‌నాథ్ యాత్రకు చాలామంది వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఒక్క విశాఖ జిల్లా నుంచే సుమారు 90 మంది వరకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో కొంతమంది విపత్తులో చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న ఏపీ భక్తుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సూచించారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో సంప్రదింపులు జరిపారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో ఆయన సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటారని సీఎంవో అధికారులు చెబుతున్నారు.