మహారాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణపై బీజేపీ, షిండే నాయకత్వలోని శివసేన మధ్య అవగాహన కుదరినిట్లు తెలుస్తోంది. షిండే వర్గానికే కీలక పదవులు దక్కనున్నాయని సమాచారం. మహారాష్ట్రలో ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఇద్దరు మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. మిగతా మంత్రులందరినీ నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో తిరుగుబాటు చేసి వచ్చిన ఏక్ నాథ్ షిండే వర్గానికి 11 మంత్రి పదవులు, బీజేపీకి 29 మంత్రి పదవులు తీసుకుందామని బీజేపీ ప్రతిపాదించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, బీజేపీ రాష్ట్ర చీఫ్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశమై.. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ ఇద్దరూ 40 నిమిషాలకుపైగా భేటీ అయి చర్చించారు.
అత్యంత కీలకమైన సీఎం పదవిలో ఇప్పటికే షిండే ఉన్నారు. దానితోపాటు హోంశాఖను కూడా షిండే వర్గానికే ఇస్తామని ప్రతిపాదించినట్టు రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. సంఖ్యా పరంగా చూసినా బీజేపీకి వంద మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండటం, షిండే వర్గం అందులో సగమే కావడంతో.. మంత్రి పదవుల సంఖ్యలో సింహ భాగం బీజేపీకి దక్కడం ఖాయమని పేర్కొంటున్నాయి.