శ్రీలంకలో సాగుతున్న ప్రజా నిరసనల్లో మాజీ క్రికెటర్ జయ సూర్య పాల్గొన్నారు. దీంతో ఆయనతో సెల్పీ కోసం నిరసన కారులు ఎగబడ్డారు. ఇదిలావుంటే శ్రీలంకలో ప్రజాగ్రహం పతాకస్థాయికి చేరింది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు నేడు అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసాన్ని చుట్టుముట్టగా, ఆయన పరారయ్యారు. కాగా, శ్రీలంక దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య కూడా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూనిన ఆయన నినాదాలు చేశారు. తాను నిరసనల్లో పాలుపంచుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ముట్టడి పరిసమాప్తమైంది. మీ కోట బురుజులు కుప్పకూలాయి. ఇకనైనా రాజీనామా చేసి గౌరవం నిలుపుకోండి" అంటూ జయసూర్య అధ్యక్షుడు గొటబయను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తానెప్పుడూ శ్రీలంక ప్రజల పక్షమేనని జయసూర్య తెలిపారు. ఈ విప్లవం శాంతియుత పంథాలో ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే దేశంలో విజయోత్సవాలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఇదిలావుంటే నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు జయసూర్యను చూసి ఆయనతో సెల్ఫీలకు పోటీలు పడ్డారు.