దేశవ్యాప్తంగా ప్రముఖుల నివాసాలపై ఐటీ శాఖ రైడ్ లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేషనల్ బిల్డింగ్స్ కన్సస్ట్రక్షన్ కార్పొరేషన్ మాజీ అధికారి డీకే మిట్టల్ నివాసంలో శనివారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. నొయిడాలోని సెక్టర్ 19లో ఉన్న ఆయన ఇంట్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. డీకే మిట్టల్ ఇంటి నుంచి రూ.2 కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు లెక్కింపు జరుగుతుంది. రెండు యంత్రాలతో కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు తీసుకున్నారు. అలాగే మిట్టల్ బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. వారు గత మూడేళ్ల లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. మిట్టల్ ఇటీవల ఎన్‌బీసీసీ నుంచి పదవీ విరమణ చేసి నోయిడాలోని సెక్టార్-19లో నివసిస్తున్నారు. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసిన అనంతరం ఈ దాడులు సాగుతున్నాయి.